Telugu Pen
Telugu Pen

నేను ఎంతో లక్కీ: ఏంజెలీనా జోలీ

ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ఆరో ప్రాణం. భర్త బ్రాడ్‌ పిట్‌ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేసింది. ఏంజెలీనాకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్‌). మాడెక్స్‌–19 కొ, పాక్స్‌–16 కొ, జహారా–15 కూ.. దత్తత తీసుకున్న పిల్లలు. షిలా–14 కూ, నాక్స్‌–12 కొ, వివియన్‌–12 కూ.. జోలీకి, బ్రాడ్‌ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు పిల్లలు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్‌ ఫెలిజ్‌ భవంతిలో క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మాడెక్స్‌ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్‌. ఇప్పుడిక ఆన్‌లైన్‌ లోనే చదువు కొనసాగిస్తున్నాడు.

మిగతా ఐదుగురివీ యూఎస్‌ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్‌ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు చూసుకుంటూ ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ విడుదలైంది. ఆ ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్‌ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్‌ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ కూడా పిల్లల సినిమానే కాకుంటే యానిమేటెడ్‌. అందులోని ఒక పాత్రకు ఏంజెలీనా జోలీ వాయిస్‌ ఇచ్చారు.

హైదరాబాద్‌ మకుటంలో మరో కలికితురాయి

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఈ రోజు ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్‌ ఇదే కావడం గమనార్హం. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్‌ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్‌ శాఖ అమాత్యులు శ్రీ కె.తారకరామారావు లాంఛనంగా నేడు ప్రారంభోత్సవం చేశారు. కార్మిక శాఖ అమాత్యులు శ్రీ చామకర మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి లోగడ ఢిల్లీ, జబల్‌పూర్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్‌ వల్ల చెత్త నుంచి విద్యుత్‌ తయారితో పాటు, చెత్త సమస్యకు పరిష్కారం మరియు  పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం కూడా  లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.

ప్రకృతి వనంలో కల్యాణం

కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు ఆశ్చర్యపోయేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను అమితంగా ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్‌ వినియోగించకూడదని దృఢంగా నిర్ణయించుకున్న తూనుగుంట్ల  గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించారు. భోజన విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే ఉపయోగించారు.

విజయనగరంలోని మన్నార్‌ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ కార్యక్రమములో ఎక్కడా ప్లాస్టిక్‌ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాయించారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు.

ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక కోరిక. తన వివాహాన్ని ప్లాస్టిక్‌ రహితంగా జరిపించాలని అడిగింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి  మరీ వినియోగించాం. నిజానికి నాలుగేళ్లుగా  ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్‌ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా వేళ్ళాడదీసామ్ – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం

ఆటకు సై అన్న సింధు

బ్యాడ్మింటన్‌ కోర్టులో సత్తా చూపేందుకు  సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ చాంపియన్, ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు . ప్రస్తుతం లండన్‌లోని గ్యాటోరెడ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జీఎస్‌ఎస్‌ఐ)తో కలిసి పనిచేస్తోన్న సింధు ప్రస్తుతం ఆటతోపాటు, మానసికంగానూ శారీరకంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని చెప్పారు. జనవరిలో ఆసియా బ్యాడ్మింటన్‌ టోర్నీలతో కోర్టులో అడుగుపెడతానన్నారు . ఈ మేరకు సన్నద్ధమవుతున్నానని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో 2021లోనే టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయని ముందే ఊహించానని… అందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని పేర్కొంది.

అందరూ ఊహించుకుంటున్నట్లుగా చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు. ఆయనకు సమాచారమిచ్చాకే జీఎస్‌ఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. న్యూట్రిషియన్, ఫిట్‌నెస్‌తో పాటు పలు అంశాలపై గత నాలుగేళ్లుగా జీఎస్‌ఎస్‌ఐ అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రపంచ మాజీ చాంపియన్స్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)లతో జరిగే మ్యాచ్‌ల్లో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తానని వెల్లడించారు.

మహమ్మారి కట్టడి లో ‘డి’ విటమిన్ పాత్ర

ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడంలో ‘డీ’ విటమిన్‌ నిర్వహించే పాత్రపై తగిన పరిశోధనలు సాగించాల్సిందిగా బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు క్వీన్‌ మేరీ యూనివర్శిటీ పరిశోధకులు తాజాగా పరిశోధనలు సాగించారు. ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు “డి” విటమిన్ ఎంతో దోహదపడుతుందని తేలింది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్‌ను క్రమబద్దీకరించడంలో డి విటమిన్‌ పాత్ర ఆమోగమని పరిశోధకులు తెలిపారు. డి విటమిన్‌ తక్కువగా ఉండి, చర్మం తీవ్రంగా దెబ్బతిన్న 86 మంది శిశువులకు మూడు నెలల పాటు “డి” విటమిన్‌ ఇవ్వగా, వారి చర్మం పూర్తిగా మెరగుపడిందని వారు అన్నారు.

బ్రిటన్‌లో 50% జనాభా  “డి”  విటమిన్‌ కొరతతో బాధ పడుతున్నారు. సహజసిద్ధంగా సూర్య రశ్మితో మానవ శరీరంలో “డి” విటమిన్‌ అభివృద్ధి చెందుతుంది. అయితే చలికాలంలో ఆ దేశంలో సూర్య రశ్మి తగలక పోవడంతో, వారిలో “డి” విటమిన్‌ కొరత ఏర్పడుతోంది. అలాంటి వారు రోజుకు మూడు “డి” విటమన్‌ను 10 ఎంసీజీ ట్యాబ్లెట్‌ రూపంలో తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రతి మనిషికి రోజుకు 23 ఎంసీజీల “డి” విటమిన్‌ అవసరం అవుతుందని, మనం తినే ఆహారం ద్వారా కొంత లభిస్తుంది కనుక రోజుకు 10ఎంసీజీ “డి”  3 విటమిన్‌ ట్యాబ్లెట్లు సరిపోతాయని వారు చెబుతున్నారు. ద్రవరూపంలో కూడా డి 3 విటమిన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎక్కువగా శిశువులకు ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు.

పాల ఉత్పత్తులతోపాటు మాంసం, చేపలు, కోడి గుడ్లు, చిరు ధాన్యాల్లో డి విటమిన్‌ ఎక్కువగా ఉంటోంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతున్న డి విటమిన్‌ పాత్రపై మరిన్ని ప్రయోగాలను సాగించడం కోసం 5 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు క్వీన్ మేరీ యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించకుంటే బ్యాంకింగ్‌కు కష్టాలే..

ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారం మోస్తున్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్రం సహాయక సహకారాలు  అందించకుంటే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు మాజీలు,  తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు ముస్తాబు అవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్‌ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్‌ హౌస్‌– రోలీ బుక్స్‌ ఆవిష్కరించనున్న  పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్‌ బందోపాధ్యాయ నలుగురు మాజీ గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు.

అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై మాజీ గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ  బ్యాంకింగ్‌ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం కొసమెరుపు. విలీనాలు, భారీ బ్యాంకింగ్‌ ఏర్పాట్లతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు.  సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం… ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు మాజీ గవర్నర్లూ ఏమన్నారంటే…

అత్యుత్సాహమూ కారణమే

సంస్థల భారీ పెట్టుబడులు, ఋణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం, మొండిబకాయిల ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది.  మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్‌ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ముందుకు సాగాలి.

– డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌

(గవర్నర్‌గా.. 2013–2016)

అతి పెద్ద సమస్య

అవును. భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య పరిష్కారంపై సత్వరం  దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారి రాకతో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది.

– దువ్వూరి సుబ్బారావు

(బాధ్యతల్లో.. 2008–2013)

ఇతర ఇబ్బందులకూ మార్గం

బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్‌ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఋణాల పెంపునకు వచ్చిన ఒత్తిళ్లు  కూడా మొండిబకాయిల భారానికి ప్రధాన కారణం. 2015–16 ఋణ నాణ్యత సమీక్ష తరువాత,  ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, ఋణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనించవచ్చు.

– వై. వేణుగోపాల్‌ రెడ్డి

(విధుల్లో.. 2003–2008)

పెద్ద నోట్ల రద్దు… సంక్షోభం!

బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్ర రూపం దాల్చింది. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు.  బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్‌ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది.

– సీ. రంగరాజన్‌

(పదవీకాలం..1992–1997)

పబ్లిక్ ఇష్యూ బాటపట్టిన జొమాటో

ఫుడ్ డెలివరీ సంస్ధ అయిన జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు సంస్థగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వరకు  2019 జూన్ మాసంలో  బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర  సంస్థలతో పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం అందరికి విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల సంస్థ  మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది.

కోటక్ మహీంద్రా

పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా . ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్టర్లుగా వున్న విషయం విదితమే.

దేశీ మార్కెట్ ఓకే

విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన సంస్థలకి  తగిన ధర లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ సంస్థల  పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలియజేశారు. 2019 జులై నెలలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ లావాదేవీల జోరు

కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్‌ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఋణాలు సంఖ్య పెరిగినప్పటికీ అక్టోబరు నెలలో ఆ ఊపును  అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి రేటు  5.1 శాతంగా  నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ ఋణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని

ఋణాలు 2020 సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరు నెలలో 48 శాతం తగ్గి, రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల్లో మ్యూచువల్‌ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి, సెప్టెంబరు మాసంలో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరు మాసంలో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లుగా  నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగబాకాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది.

గూగుల్‌ చెల్లింపు విధానాలపై సీఐఐ దృష్టి

ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ చెల్లింపు విధానాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. గూగుల్‌ పే, గూగుల్‌ ప్లే స్టోర్‌ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. గూగుల్‌కు చెందిన ‘పే’ అనేది డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం కాగా ‘ప్లే’ అనేది ఆండ్రాయిడ్‌ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్‌ స్టోర్‌. తన గుత్తాధిపత్యంతో పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్‌ విధానాలు ఉంటున్నాయని సీసీఐ వ్యాఖ్యానించింది.

గూగుల్ ప్లేస్టోర్‌లోని పెయిడ్‌ యాప్స్ , ఇన్‌– యాప్స్ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్‌ ప్లే చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలంటూ గూగుల్‌ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది. ఫీజులు కూడా భారీగా వసూలు చేయడం వల్ల డెవలపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది . ఈ నేపథ్యంలో అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ, గూగుల్‌ ఐర్లాండ్, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌పై విచారణ జరపాలని తమ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలను జారీ చేసింది.

కరోనా ఆట

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్‌ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ఒక నిమిషం పాటు సాగే కోవిడ్‌-19 ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి. మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్‌ ఆగించండి. గేమ్ ఆడాక మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఈ గేమ్ పన్నెండు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కోవిడ్‌-19 పై పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్‌ బేస్డ్‌ గేమ్‌ దీన్ని మోబైల్‌, టాబ్లెట్‌, లాప్‌టాప్‌, పీసీ ఎందులోనైనా డౌన్లోడ్ చేసుకుని ఆడొచ్చు. కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు.

ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్‌. సరైన పనులు అంటే గేమ్‌లోని పాత్రలు సరైన కోవిడ్‌ జాగ్రత్తలు పాటించినప్పుడల్లా (మాస్క్‌ ధరించటం, శానిటైజర్‌ వాడటం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం ) ఒక పాయింట్‌ కలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోతారు.ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని వసుధ టీకే, ఎన్‌ఎస్‌ కీర్తి, శివప్రియ వెళైచామీ అనే విద్యార్థులు రూపొందించారు. ఈ గేమ్‌ని విద్యార్థులు జనవరి నుంచి మే మధ్య అందించే లెట్స్‌ ప్లే టూ లెర్న కోర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ కోర్సులో 30 మంది విద్యార్థులు పాలుపంచుకుని వివిధ అంశాలపై బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించారు. ఇందులో ముగ్గురు కవిడ్-19 సంబంధిత గేమ్‌ని తయారుచేశారు. కొందరి అభిప్రాయం సేకరించిన తర్వాత గేమ్‌ని ఇంకొన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిశ్చయించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని గేమ్స్‌ని రూపొందిస్తామని విద్యార్థులు అంటున్నారు.