Category: News

పబ్‌జీ ప్రియులకు తీపి కబురు

ప్రముఖ మొబైల్‌ గేమ్‌ పబ్‌జీ తన భారతీయ యూజర్ల నోటిని తీపి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం కొత్త అవతారంలో ఈ గేమ్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌ని  ‘పబ్‌జీ మొబైల్‌ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్‌ చేయనున్నామని  పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న యోచన లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ నిబంధనలకు లోబడి, సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పబ్‌జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే మైక్రోసాఫ్ట్‌తో చేయి కలిపింది. అజూర్ క్లౌడ్‌లో యూజర్‌ డేటా స్టోర్‌ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారమే ప్రకటించింది. అంతేకాదు గేమ్‌ డెవలప్‌మెంట్‌, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. ‘పబ్‌జీ మొబైల్‌  ఇండియా’ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నామని కంపెనీ తెలిపింది. కాగా కరోనా వైరస్‌, సరిహద్దుల మధ్య వున్నా ఉద్రిక్తల నడుమ  చైనాకు చెందిన పలు  యాప్‌లను(పబ్‌జీ సహా) భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో (అక్టోబర్‌ 30,శుక్రవారం) నుంచి భారత్‌లో పబ్‌జీ గేమ్‌కు సంబంధించిన సర్వీసులు, యాక్సిస్ లను  నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్‌ గేమ్స్ ప్రకటించిన సంగతి  తెలిసిందే. తాజా పరిణామాల నడుమ ఈ గేమ్‌ మళ్లీ భారతీయులకు అందుబాటులోకి రానుంది.

యువ వ్యాపారవేత్తతో చేతులు కలిపిన రతన్ టాటా

టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త దిగ్గజం రతన్ టాటా తాజా పెట్టుబడులు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.  ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయనగోప్యంగా ఉంచారు.  ముంబైలోని  యువ వ్యవస్థాపకుడు, సీఈవో  అర్జున్ దేశ్‌పాండే (18)కు  చెందిన ‘జనరిక్‌ ఆధార్‌’లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు.

సరసమైన ధరలకే అందరికీ ఔషధాలను అందించాలనే బృహత్ ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్‌ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల  ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును భారీగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది.  ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు.  ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో ఈ స్టార్టప్ వుంది. అలాగే  రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.  న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యం చేసుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది.  అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు  ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తోంది.

కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం చాలా ఆనందంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళిన సమయంలో  జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు అందుబాటు ధరలకు మందులు తేవాలని నిర్ణయించుకున్నానన్నారు.  కాగా  అర్జున్‌ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే  షార్ట్ లిస్ట్ కావడం కొసమెరుపు .

 

అజీం ప్రేమ్‌జీ – దాతృత్వంలో మేటి

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అధినేత శ్రీ అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ ముందంజ లో నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్‌ రిపోర్ట్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో  ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శ్రీ శివ నాడార్‌ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీ ముకేశ్‌ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్‌ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాలు ఇచ్చే తీరులో కొంత మార్పు కనబడుతోంది.

కరోనాపై పోరాటానికి టాటా సన్స్‌ అత్యధికంగా రూ. 1,500 కోట్లు ప్రకటించగా, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్‌ ఫండ్‌కే ప్రకటించడం గమనార్హం. ఈ ఫండ్కే  లయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు చేరినట్టు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచ్చిన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్‌ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్‌ గోపాలకృష్ణన్‌ (రూ. 50 కోట్లు), ఎస్‌డీ శిబులాల్‌ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్‌ జాబితాలో ఉన్నారు.

విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్‌ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు నిలిచాయి. భారీ విరాళాలు ఇచ్చిన  వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచ్చిన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్‌ నీలేకని సతీమణి శ్రీమతి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.అజీం ప్రేమ్‌జీ దాతృత్వం మేటి.

అయాన్ చావ్లా – అద్భుత దీపం

ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్‌ కావాలి’ అని అడిగాడు అయాన్‌. ‘ఈ వయసులో కంప్యూటర్‌ ఎందుకు నాన్నా….బుద్ధిగా చదువుకోకుండా…’ అని కుంజమ్‌ చావ్లా అన్నారో  లేదో  తెలియదు, ఒక ఫైన్‌మార్నింగ్‌ ఆ ఇంటికి కంప్యూటర్‌ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్‌ అద్భుతదీపం అవుతుందని అయాన్‌ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్‌ ఆడి విసుగెత్తిన అయాన్‌ దృష్టి ‘ఎడిటింగ్‌’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి  పెరిగింది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్‌ చేయగలుగుతున్నాను. వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్, యాప్‌లు క్రియేట్‌ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది.  ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని బిడియ పడ్డాడు.

ఆ భయమే తనకు తాను గురువుగా మారే సాదావాకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని వాటిలో పురుగు అయ్యాడు. నెట్‌లో దొరికిన సమాచారాన్ని దొరికినట్లు అవగాహనా చేసుకునే వాడు. మొదట్లో  అర్థం కానట్లు, అర్థమై నట్లు….రకరకాలుగా ఉండేది. పదమూడు ఏళ్ల వయసులో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి పన్నెండు లాంగ్వేజ్‌లపై పట్టు సాధించాడు.

అమ్మ దగ్గర నుంచి తీసుకొన్న పదివేల రూపాయాల పెట్టుబడితో  2011లో సోషల్‌ కనెక్టివీటి ప్లాట్‌ఫాం గ్రూప్‌ ఆఫ్‌ బడ్డీస్, రెండు నెలల తరువాత ఏషియన్‌ ఫాక్స్‌ డెవలప్‌మెంట్‌(వెబ్‌ సోల్యూషన్స్‌), 2013లో మైండ్‌–ఇన్‌ అడ్వర్‌టైజింగ్‌(మీడియా–మార్కెటింగ్‌), గ్లోబల్‌ వెబ్‌మౌంట్‌(డోమైన్స్, వెబ్‌సైట్‌ అండ్‌ మోర్‌) కంపెనీలు మొదలుపెట్టాడు.

అయితే అయాన్‌ పని అంత సులువు కాలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. అయితే ఇదంతా కష్టం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కష్టంలోనే తనకు ఇష్టమైన ‘కిక్‌’ని వెతుకున్నాడు. మొదట్లో ఈ చిన్నవాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమ దగ్గరకు వచ్చే మార్కెటింగ్‌ సేల్స్‌మెన్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు. ఆ తరువాత మాత్రం అయాన్‌లోని టాలెంట్‌ పదిమంది దృష్టిలో పడింది.

‘కుర్రోడి లో విషయం వుంది’ అనే నమ్మకం ఏర్పడింది. కస్టమర్ బేస్ పెరిగింది. యూఎస్, యూకే, హాంగ్‌కాంగ్, టర్కీలలో అయాన్‌ కంపెనీలకు  శాఖలు ఉన్నాయి. అనతి కాలంలోనే లక్షలాది మంది కస్టమర్లు ఏర్పడ్డారు. 18 సంవత్సరాల వయసులో ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రశంసా లేఖ అందుకున్నాడు. నైట్‌ పార్టీలకు దూరంగా ఉండే అయాన్‌ చావ్లా  ప్రభుత్వ పాఠాశాలల్లోని పేద విద్యార్థులను మోటివెట్‌ చేయడంలో ముందు ఉంటాడు. క్షణం తీరికలేని వ్యవహారాల్లో నుంచి తీరిక చేసుకొని కాన్ఫరెన్స్, సెమినార్, వెబినార్‌లలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తుంటాడు. 2014–2015లో ఫ్లోరిడాలో జరిగిన ‘ఎంటర్‌ప్రైజ్‌ కనెక్ట్‌’లో ఉపన్యాసకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ ఢిల్లీ కెరటం.

‘విలువలు, అంకితభావం, సహనం…ఇలాంటివి మా అమ్మ నుంచి అందిపుచ్చుకున్నాను. ఆమె నా కలల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఇన్నివిజయాలు అందని ద్రాక్ష లానే ఉండేవి’ అంటాడు తన తల్లి కుంజమ్‌ చావ్లా గురించి. అయాన్‌ చావ్లా  కంపెనీ ట్యాగ్‌లైన్‌లోనే అసలు విజయరహస్యం దాగుంది.

గిన్నిస్‌ బుక్ లోకి ఉత్తరాఖండ్‌ రైతు

సాధారణంగా ధనియాల మొక్క 2–3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గోపాల్‌ ఆపిల్‌ తోటలో ధనియాల మొక్క ఏకంగా ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరిగింది. ఇది గిన్నిస్‌ రికార్డ్‌. గతంలో ధనియాల మొక్క 5.9 అడుగుల ఎత్తుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదై ఉంది. కొద్ది కాలం క్రితం గోపాల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు.

గోపాల్‌ దత్‌ ఉప్రేటి స్వతహాగా సివిల్‌ ఇంజనీర్‌. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను తొలిసారి గుర్తించారు. తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి రాజీనామ చేసి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రాణిఖేత్‌ ప్రాంతంలోని స్వగ్రామం బిల్‌కేష్‌కు తిరిగి వచ్చారు. 2015 నుంచి తనకున్న మూడెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 8 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఆయన తోటలో 2వేల ఆపిల్‌ చెట్లున్నాయి. వాటి మధ్య వందలకొద్దీ ఎత్తయిన ధనియాల మొక్కలు కనిపిస్తాయి. అల్లం, పసుపు కూడా అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఆయన తోటలో ధనియాల మొక్కలు బాగా ఎత్తుగా వుండటం చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వరకు ఆ విషయాన్ని ఆయన గుర్తించకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో స్నేహితుల సూచన మేరకు స్థానిక ఉద్యాన శాఖ అధికారిని ఆహ్వానించి తన తోటలోని ధనియాల మొక్కల ఎత్తును కొలిపించాడు గోపాల్‌. ఎక్కువ శాతం మొక్కలు ఐదు అడుగుల వరకు ఎత్తు ఉండగా, ఒక మొక్క మాత్రం ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరగటం గుర్తించి నమోదు చేశారు. 2020 ఏప్రిల్‌ 21న గిన్నిస్‌ బుక్‌ తన వెబ్‌సైట్‌లో ఇదే అత్యంత ఎత్తయిన ధనియాల మొక్క అని ప్రకటించింది.

నిజానికి, గోపాల్‌ ధనియాల మొక్కలను ఆపిల్‌ చెట్లకు చీడపీడల బెడద తగ్గుతుందన్న ఉద్దేశంతో అంతర పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ధనియాల మొక్క పూలకు ఆకర్షితమై తేనెటీగలు, ఈగలు తోటలోకి వస్తూ ఉండటం వల్ల చీడపీడల బెడద తగ్గిందని ఆయన అంటున్నారు.  స్థానికంగా దొరికే ధనియాలనే విత్తనాలుగా వేశారు. అయితే ఎత్తుగా పెరగటం కోసం ధనియాల మొక్కల కొమ్మలను కత్తిరిస్తూ ఉంటారు. వేపపిండి, జీవామృతం వేస్తూ, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఇంకా ఏ రకమైన ప్రత్యేక పోషణ అంటూ ఏమీ లేదని గోపాల్‌ తెలిపారు.

అయితే, గత ఐదేళ్లుగా తన తోటలో పెరిగే ధనియాల మొక్కల్లోనే మెరుగైన వాటిని ఎంపిక చేసి, ఆ విత్తనాలనే తదుపరి పంటగా విత్తటం వల్ల అనుకోకుండానే ఓ సరికొత్త ధనియాల వంగడం తయారైంది ఆయన చెప్పారు. ఒక్కో మొక్క అర కేజీ వరకు ధనియాల దిగుబడినివ్వటం ఇక్కడ విశేషం. సాధారణ ధనియాల మొక్క నుంచి 20–50 గ్రాముల మేరకు  దిగుబడి వస్తుంది. ధనియాల పంట విత్తటంలో మెలకువలను గోపాల్‌ ఇలా వివరించారు.. ‘మట్టిలో అర అంగుళం నుంచి అంగుళం లోతులోనే  ధనియాలను విత్తుకోవాలి. రెండు విత్తనాలకు మధ్య 5–6 అంగుళాల దూరం ఉంచాలి. నేలలో తేమ ఆరిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువ నీరు పోస్తే వేరు కుళ్ళి దెబ్బతింటుది. కుండీలు, మడుల్లో సాగు చేసే వారు ఖచ్చితంగా ఎక్కువైన నీరు బయటకు పోయేందుకు వీలుగా  కుండీ/మడి కింది భాగంలో విధిగా బెజ్జాలు పెట్టాలని సూచించారు. ధనియాల మొక్క ప్రధాన వేరు బాగా లోతుకు వెళ్తుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైనా ధనియాలను సాగు చేసుకోవచ్చన్నారు. ఇతర రైతులకు ఇవ్వటానికి వెయ్యి ధనియాల విత్తనాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.

బయట పడ్డ రహస్య బీచ్‌

ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రకృతి అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం, వాటిని చూసి అచ్చరవొందడం  కూడా మనకు అనుభవమే. అందులో కొన్ని అసామాన్యమయినవి  అపురూపమైనవిగా ఉంటాయి. అలాంటి కోవకే  చెందినది మెక్సికో లోని పశ్చిమ తీరానికి చెందిన మారియెట్‌ దీవుల్లో దాగిన రహస్య బీచ్‌. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్‌ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్‌ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే వీలు కుదిరింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ, మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ రహస్య బీచ్‌ ఓ బిలం లోపల ఉన్నట్లుగా కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా టార్సిసియో స్వారెజ్‌ అనే వీడియో గ్రాఫర్‌ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్‌ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చాయి.

బోన్‌లెస్ చికెన్ పేరును దయచేసి మార్చండి

చికెన్ అంటే ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రైనా ఉంటారా చెప్పండి! చికెన్‌కు యూనివ‌ర్స‌ల్ ఫ్యాన్స్ ఉంటార‌న‌డం అతిశ‌యోక్తి కాదు. పైగా క‌రోనా టైంలో ఎంత చికెన్ తింటే అంత రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక చికెన్‌లో వంద‌ల ర‌కాల వంట‌కాలు ఉన్నాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పే అవసరమే లేదు.  అందులోనూ హోట‌ల్స్, రెస్టారెంట్ల‌లో చికెన్ పేరుతో  త‌యారు చేసే చికెన్ క‌బాబ్స్‌, చికెన్ 65, బోన్‌లెస్ చికెన్‌, చికెన్ క‌ర్రీస్ లాంటి వంద‌ల ర‌కాల మెనూ ఐట‌మ్స్ మ‌న క‌ళ్ల ముందు మెదులుతాయి. వీటికి ర‌కర‌కాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం త‌ప్ప అస‌లు వాటికి ఆ పేరెలా వ‌చ్చింద‌న్న‌ది ఆలోచించే వారి సంఖ్య బహు తక్కువే ఉంటుంది.

చికెన్ పేరు చెబితే చాలు.. మాకు ఇంకేం అవ‌స‌రం లేదంటూ లొట్ట‌లేసుకుని లాగించేసే ఈ రోజుల్లో నెబ్రాస్కాకు చెందిన ఒక వ్య‌క్తి మాత్రం బోన్‌లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి చెందిన లింక‌న్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేయ‌డం చాలామందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. నెబ్రాస్కాకు చెందిన  అండ‌ర్ క్రిస్టిన్‌స‌న్ అనే వ్య‌క్తి బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను “చికెన్ టెండ‌ర్స్‌గా” నామకరణం చేయవలసిందిగా  లింక‌న్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేశాడు.  క్రిస్టిన్‌స‌న్ చేసిన తీర్మానం అక్క‌డున్న‌వారికి న‌వ్వు తెప్పించింది. కానీ అండ‌ర్ ఆ మాట ఎందుకు చెప్పాల్సివ‌చ్చింద‌నేది అత‌ను చెప్పిన మాటల ద్వారా అవగతమయ్యింది.

‘బోన్‌లెస్ చికెన్ అనే ప‌దానికి అర్థం తెలుసుకోకుండానే ఆ పేరును వాడుతున్నారు. సాధార‌ణంగా బోన్‌లెస్ చికెన్ అనే ప‌దం కోడి రెక్క‌ల‌ను విరిచి చెస్తారే త‌ప్ప మాంసం నుంచి ఎముక‌లను వేరు చేయ‌రు. ఎందుకంటే మ‌నం తినే మాంసంలో అధిక‌బ‌లం ఎముక‌ల్లోనే ఉంటుంది. ఆ విష‌యం తెలుసుకోకుండా రెస్టారెంట్ల‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు బోన్‌లెస్ చికెన్ అనే పేరును వాడుతున్నారు. నేను వెళ్లిన ప్ర‌తీ రెస్టారెంటు‌లో ఇదే గ‌మ‌నించాను. అంతవరకు ఎందుకు, నా పిల్ల‌లు కూడా బోన్‌లెస్ చికెన్ అర్థం తెలియ‌కుండానే దాన్ని ఆర్డ‌ర్ చేయ‌డం గ‌మ‌నించాను. అందుకే ఈరోజు సిటీ కౌన్సిల్ వేదిక‌గా ఒక తీర్మానం చేయాల‌ని  అనుకుంటున్నాను .. అదే బోన్‌లెస్ చికెన్ వింగ్ అనే పేరును హోట‌ల్స్ మెనూ నుంచి తొల‌గించాలి. బోన్‌లెస్ అనే ప‌దానికి బదులుగా చికెన్ టెండ‌ర్‌, సాసీ న‌గ్స్‌, వెట్ టెండ‌ర్స్ లాంటి పేర్ల‌ను పెడితే నప్పుతుంది ‘అంటూ చెప్పుకొచ్చాడు.

నేను ఎంతో లక్కీ: ఏంజెలీనా జోలీ

ఏంజెలీనా జోలీకి పిల్లలంటే ఆరో ప్రాణం. భర్త బ్రాడ్‌ పిట్‌ పిల్లల్ని చిన్న మాట అన్నాడని అతడికి విడాకులు ఇచ్చేసింది. ఏంజెలీనాకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఈ ఆరుగురిలో ముగ్గురు కడుపున పుట్టిన వారు. ముగ్గురు కడుపుకు కట్టుకున్నవారు (అడాప్టెడ్‌). మాడెక్స్‌–19 కొ, పాక్స్‌–16 కొ, జహారా–15 కూ.. దత్తత తీసుకున్న పిల్లలు. షిలా–14 కూ, నాక్స్‌–12 కొ, వివియన్‌–12 కూ.. జోలీకి, బ్రాడ్‌ కీ పుట్టిన వాళ్లు. ఈ చివరి ఇద్దరు పిల్లలు కవలలు. ఈ తల్లీబిడ్డలు ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌లోని తమ సొంత లాస్‌ ఫెలిజ్‌ భవంతిలో క్వారెంటైన్‌లో ఉంటున్నారు. మాడెక్స్‌ ఐదు నెలల క్రితమే దక్షిణ కొరియా నుంచి అమెరికా వచ్చేశాడు. అక్కడి యాన్సీ యూనివర్సిటీలో అతడు బయోకెమిస్ట్రీ స్టూడెంట్‌. ఇప్పుడిక ఆన్‌లైన్‌ లోనే చదువు కొనసాగిస్తున్నాడు.

మిగతా ఐదుగురివీ యూఎస్‌ చదువులే కనుక అంతా ఒకదేశంలో ఒకేచోట ఉన్నారు. ‘అయామ్‌ సో లక్కీ..’ అంటారు జోలీ తన పిల్ల సైన్యాన్ని చూసుకుని. తల్లికి అస్సలు పని పెట్టరట. చిన్న పిల్లల్ని పెద్దపిల్లలు చూసుకుంటూ ఉంటారట. ఆగస్టు 21న జోలీ కొత్త సినిమా ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ విడుదలైంది. ఆ ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆమె ఇంటి విశేషాలు బయటికి వచ్చాయి. ఇల్లంటే జోలీకి పిల్లలే. 45 ఏళ్ల జోలీ.. పెద్ద కొడుకు మాడెక్స్‌ ని కంబోడియా నుంచి, రెండో కొడుకు పాక్స్‌ని వియత్నాం నుంచి, పెద్ద కూతురు జహారాను ఇథియోపియా నుంచి దత్తతు తెచ్చుకున్నారు. ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ ఇవాన్‌’ కూడా పిల్లల సినిమానే కాకుంటే యానిమేటెడ్‌. అందులోని ఒక పాత్రకు ఏంజెలీనా జోలీ వాయిస్‌ ఇచ్చారు.

హైదరాబాద్‌ మకుటంలో మరో కలికితురాయి

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఈ రోజు ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్‌ ఇదే కావడం గమనార్హం. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్‌ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్‌ శాఖ అమాత్యులు శ్రీ కె.తారకరామారావు లాంఛనంగా నేడు ప్రారంభోత్సవం చేశారు. కార్మిక శాఖ అమాత్యులు శ్రీ చామకర మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి లోగడ ఢిల్లీ, జబల్‌పూర్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్‌ వల్ల చెత్త నుంచి విద్యుత్‌ తయారితో పాటు, చెత్త సమస్యకు పరిష్కారం మరియు  పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం కూడా  లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.

ప్రకృతి వనంలో కల్యాణం

కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు ఆశ్చర్యపోయేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను అమితంగా ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్‌ వినియోగించకూడదని దృఢంగా నిర్ణయించుకున్న తూనుగుంట్ల  గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించారు. భోజన విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే ఉపయోగించారు.

విజయనగరంలోని మన్నార్‌ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ కార్యక్రమములో ఎక్కడా ప్లాస్టిక్‌ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్‌తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాయించారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు.

ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక కోరిక. తన వివాహాన్ని ప్లాస్టిక్‌ రహితంగా జరిపించాలని అడిగింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి  మరీ వినియోగించాం. నిజానికి నాలుగేళ్లుగా  ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్‌ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా వేళ్ళాడదీసామ్ – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం