Category: Business

యువ వ్యాపారవేత్తతో చేతులు కలిపిన రతన్ టాటా

టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త దిగ్గజం రతన్ టాటా తాజా పెట్టుబడులు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.  ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయనగోప్యంగా ఉంచారు.  ముంబైలోని  యువ వ్యవస్థాపకుడు, సీఈవో  అర్జున్ దేశ్‌పాండే (18)కు  చెందిన ‘జనరిక్‌ ఆధార్‌’లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు.

సరసమైన ధరలకే అందరికీ ఔషధాలను అందించాలనే బృహత్ ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్‌ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల  ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును భారీగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది.  ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు.  ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో ఈ స్టార్టప్ వుంది. అలాగే  రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.  న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యం చేసుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది.  అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు  ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తోంది.

కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం చాలా ఆనందంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళిన సమయంలో  జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు అందుబాటు ధరలకు మందులు తేవాలని నిర్ణయించుకున్నానన్నారు.  కాగా  అర్జున్‌ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే  షార్ట్ లిస్ట్ కావడం కొసమెరుపు .

 

అజీం ప్రేమ్‌జీ – దాతృత్వంలో మేటి

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అధినేత శ్రీ అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ ముందంజ లో నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్‌ రిపోర్ట్‌ ఇండియా, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో  ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శ్రీ శివ నాడార్‌ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీ ముకేశ్‌ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్‌ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాలు ఇచ్చే తీరులో కొంత మార్పు కనబడుతోంది.

కరోనాపై పోరాటానికి టాటా సన్స్‌ అత్యధికంగా రూ. 1,500 కోట్లు ప్రకటించగా, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్‌ ఫండ్‌కే ప్రకటించడం గమనార్హం. ఈ ఫండ్కే  లయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు చేరినట్టు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచ్చిన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్‌ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్‌ గోపాలకృష్ణన్‌ (రూ. 50 కోట్లు), ఎస్‌డీ శిబులాల్‌ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్‌ జాబితాలో ఉన్నారు.

విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్‌ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు నిలిచాయి. భారీ విరాళాలు ఇచ్చిన  వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచ్చిన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్‌ నీలేకని సతీమణి శ్రీమతి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.అజీం ప్రేమ్‌జీ దాతృత్వం మేటి.

అయాన్ చావ్లా – అద్భుత దీపం

ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్‌ కావాలి’ అని అడిగాడు అయాన్‌. ‘ఈ వయసులో కంప్యూటర్‌ ఎందుకు నాన్నా….బుద్ధిగా చదువుకోకుండా…’ అని కుంజమ్‌ చావ్లా అన్నారో  లేదో  తెలియదు, ఒక ఫైన్‌మార్నింగ్‌ ఆ ఇంటికి కంప్యూటర్‌ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్‌ అద్భుతదీపం అవుతుందని అయాన్‌ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్‌ ఆడి విసుగెత్తిన అయాన్‌ దృష్టి ‘ఎడిటింగ్‌’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి  పెరిగింది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్‌ చేయగలుగుతున్నాను. వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్, యాప్‌లు క్రియేట్‌ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది.  ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని బిడియ పడ్డాడు.

ఆ భయమే తనకు తాను గురువుగా మారే సాదావాకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని వాటిలో పురుగు అయ్యాడు. నెట్‌లో దొరికిన సమాచారాన్ని దొరికినట్లు అవగాహనా చేసుకునే వాడు. మొదట్లో  అర్థం కానట్లు, అర్థమై నట్లు….రకరకాలుగా ఉండేది. పదమూడు ఏళ్ల వయసులో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి పన్నెండు లాంగ్వేజ్‌లపై పట్టు సాధించాడు.

అమ్మ దగ్గర నుంచి తీసుకొన్న పదివేల రూపాయాల పెట్టుబడితో  2011లో సోషల్‌ కనెక్టివీటి ప్లాట్‌ఫాం గ్రూప్‌ ఆఫ్‌ బడ్డీస్, రెండు నెలల తరువాత ఏషియన్‌ ఫాక్స్‌ డెవలప్‌మెంట్‌(వెబ్‌ సోల్యూషన్స్‌), 2013లో మైండ్‌–ఇన్‌ అడ్వర్‌టైజింగ్‌(మీడియా–మార్కెటింగ్‌), గ్లోబల్‌ వెబ్‌మౌంట్‌(డోమైన్స్, వెబ్‌సైట్‌ అండ్‌ మోర్‌) కంపెనీలు మొదలుపెట్టాడు.

అయితే అయాన్‌ పని అంత సులువు కాలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. అయితే ఇదంతా కష్టం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కష్టంలోనే తనకు ఇష్టమైన ‘కిక్‌’ని వెతుకున్నాడు. మొదట్లో ఈ చిన్నవాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమ దగ్గరకు వచ్చే మార్కెటింగ్‌ సేల్స్‌మెన్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు. ఆ తరువాత మాత్రం అయాన్‌లోని టాలెంట్‌ పదిమంది దృష్టిలో పడింది.

‘కుర్రోడి లో విషయం వుంది’ అనే నమ్మకం ఏర్పడింది. కస్టమర్ బేస్ పెరిగింది. యూఎస్, యూకే, హాంగ్‌కాంగ్, టర్కీలలో అయాన్‌ కంపెనీలకు  శాఖలు ఉన్నాయి. అనతి కాలంలోనే లక్షలాది మంది కస్టమర్లు ఏర్పడ్డారు. 18 సంవత్సరాల వయసులో ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రశంసా లేఖ అందుకున్నాడు. నైట్‌ పార్టీలకు దూరంగా ఉండే అయాన్‌ చావ్లా  ప్రభుత్వ పాఠాశాలల్లోని పేద విద్యార్థులను మోటివెట్‌ చేయడంలో ముందు ఉంటాడు. క్షణం తీరికలేని వ్యవహారాల్లో నుంచి తీరిక చేసుకొని కాన్ఫరెన్స్, సెమినార్, వెబినార్‌లలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తుంటాడు. 2014–2015లో ఫ్లోరిడాలో జరిగిన ‘ఎంటర్‌ప్రైజ్‌ కనెక్ట్‌’లో ఉపన్యాసకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ ఢిల్లీ కెరటం.

‘విలువలు, అంకితభావం, సహనం…ఇలాంటివి మా అమ్మ నుంచి అందిపుచ్చుకున్నాను. ఆమె నా కలల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఇన్నివిజయాలు అందని ద్రాక్ష లానే ఉండేవి’ అంటాడు తన తల్లి కుంజమ్‌ చావ్లా గురించి. అయాన్‌ చావ్లా  కంపెనీ ట్యాగ్‌లైన్‌లోనే అసలు విజయరహస్యం దాగుంది.

కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించకుంటే బ్యాంకింగ్‌కు కష్టాలే..

ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారం మోస్తున్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్రం సహాయక సహకారాలు  అందించకుంటే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు మాజీలు,  తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు ముస్తాబు అవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్‌ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్‌ హౌస్‌– రోలీ బుక్స్‌ ఆవిష్కరించనున్న  పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్‌ బందోపాధ్యాయ నలుగురు మాజీ గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు.

అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై మాజీ గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ  బ్యాంకింగ్‌ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం కొసమెరుపు. విలీనాలు, భారీ బ్యాంకింగ్‌ ఏర్పాట్లతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు.  సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం… ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు మాజీ గవర్నర్లూ ఏమన్నారంటే…

అత్యుత్సాహమూ కారణమే

సంస్థల భారీ పెట్టుబడులు, ఋణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం, మొండిబకాయిల ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది.  మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్‌ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ముందుకు సాగాలి.

– డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌

(గవర్నర్‌గా.. 2013–2016)

అతి పెద్ద సమస్య

అవును. భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య పరిష్కారంపై సత్వరం  దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారి రాకతో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది.

– దువ్వూరి సుబ్బారావు

(బాధ్యతల్లో.. 2008–2013)

ఇతర ఇబ్బందులకూ మార్గం

బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్‌ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఋణాల పెంపునకు వచ్చిన ఒత్తిళ్లు  కూడా మొండిబకాయిల భారానికి ప్రధాన కారణం. 2015–16 ఋణ నాణ్యత సమీక్ష తరువాత,  ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, ఋణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనించవచ్చు.

– వై. వేణుగోపాల్‌ రెడ్డి

(విధుల్లో.. 2003–2008)

పెద్ద నోట్ల రద్దు… సంక్షోభం!

బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్ర రూపం దాల్చింది. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు.  బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్‌ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది.

– సీ. రంగరాజన్‌

(పదవీకాలం..1992–1997)

పబ్లిక్ ఇష్యూ బాటపట్టిన జొమాటో

ఫుడ్ డెలివరీ సంస్ధ అయిన జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు సంస్థగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వరకు  2019 జూన్ మాసంలో  బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర  సంస్థలతో పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం అందరికి విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల సంస్థ  మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది.

కోటక్ మహీంద్రా

పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా . ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్టర్లుగా వున్న విషయం విదితమే.

దేశీ మార్కెట్ ఓకే

విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన సంస్థలకి  తగిన ధర లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ సంస్థల  పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలియజేశారు. 2019 జులై నెలలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ లావాదేవీల జోరు

కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్‌ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఋణాలు సంఖ్య పెరిగినప్పటికీ అక్టోబరు నెలలో ఆ ఊపును  అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి రేటు  5.1 శాతంగా  నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ ఋణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని

ఋణాలు 2020 సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరు నెలలో 48 శాతం తగ్గి, రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల్లో మ్యూచువల్‌ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి, సెప్టెంబరు మాసంలో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరు మాసంలో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లుగా  నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగబాకాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది.

గూగుల్‌ చెల్లింపు విధానాలపై సీఐఐ దృష్టి

ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ చెల్లింపు విధానాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. గూగుల్‌ పే, గూగుల్‌ ప్లే స్టోర్‌ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. గూగుల్‌కు చెందిన ‘పే’ అనేది డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం కాగా ‘ప్లే’ అనేది ఆండ్రాయిడ్‌ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్‌ స్టోర్‌. తన గుత్తాధిపత్యంతో పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్‌ విధానాలు ఉంటున్నాయని సీసీఐ వ్యాఖ్యానించింది.

గూగుల్ ప్లేస్టోర్‌లోని పెయిడ్‌ యాప్స్ , ఇన్‌– యాప్స్ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్‌ ప్లే చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలంటూ గూగుల్‌ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది. ఫీజులు కూడా భారీగా వసూలు చేయడం వల్ల డెవలపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది . ఈ నేపథ్యంలో అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ, గూగుల్‌ ఐర్లాండ్, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌పై విచారణ జరపాలని తమ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలను జారీ చేసింది.