యువ వ్యాపారవేత్తతో చేతులు కలిపిన రతన్ టాటా

tata-1.jpg

టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త దిగ్గజం రతన్ టాటా తాజా పెట్టుబడులు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.  ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయనగోప్యంగా ఉంచారు.  ముంబైలోని  యువ వ్యవస్థాపకుడు, సీఈవో  అర్జున్ దేశ్‌పాండే (18)కు  చెందిన ‘జనరిక్‌ ఆధార్‌’లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు.

సరసమైన ధరలకే అందరికీ ఔషధాలను అందించాలనే బృహత్ ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్‌ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల  ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును భారీగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది.  ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు.  ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో ఈ స్టార్టప్ వుంది. అలాగే  రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.  న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యం చేసుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది.  అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు  ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తోంది.

కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం చాలా ఆనందంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళిన సమయంలో  జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు అందుబాటు ధరలకు మందులు తేవాలని నిర్ణయించుకున్నానన్నారు.  కాగా  అర్జున్‌ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే  షార్ట్ లిస్ట్ కావడం కొసమెరుపు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top