1000 వ విజయాన్ని అందుకున్న స్పెయిన్ బుల్

స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ తన విజయ పరంపరలో  మరో అడుగు ముందుకేశాడు. పారిస్‌ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా తన 1000వ విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపు బావుటా ఎగుర వేసాడు. తద్వారా ఓపెన్‌ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.

నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్‌ (1,274), రోజర్‌ ఫెడరర్‌ (1,242), ఇవాన్‌ లెండిల్‌ (1,068) మాత్రమే ఉన్నారు. 2002 ఏప్రిల్‌ 29న 16 ఏళ్ల వయసులో రమోన్‌ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో తన విజయాల వేటను ఆరంభించిన నాదల్… 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్‌ సెమీఫైనల్లో ఇవాన్‌ డొడిగ్‌ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్‌లో 500వ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా 20వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన నాదల్‌… పురుషుల విభాగంలో ఫెడరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ రికార్డు (20)ను సమం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *