ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జీ తన భారతీయ యూజర్ల నోటిని తీపి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం కొత్త అవతారంలో ఈ గేమ్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్‌ని ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్నామని పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలన్న యోచన లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
ప్రభుత్వ నిబంధనలకు లోబడి, సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పబ్‌జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే మైక్రోసాఫ్ట్‌తో చేయి కలిపింది. అజూర్ క్లౌడ్‌లో యూజర్ డేటా స్టోర్ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారమే ప్రకటించింది. అంతేకాదు గేమ్ డెవలప్‌మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నామని కంపెనీ తెలిపింది. కాగా కరోనా వైరస్, సరిహద్దుల మధ్య వున్నా ఉద్రిక్తల నడుమ చైనాకు చెందిన పలు యాప్‌లను(పబ్‌జీ సహా) భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో (అక్టోబర్ 30,శుక్రవారం) నుంచి భారత్‌లో పబ్‌జీ గేమ్‌కు సంబంధించిన సర్వీసులు, యాక్సిస్ లను నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నడుమ ఈ గేమ్ మళ్లీ భారతీయులకు అందుబాటులోకి రానుంది.