చికెన్ అంటే ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా చెప్పండి! చికెన్‌కు యూనివర్సల్ ఫ్యాన్స్ ఉంటారనడం అతిశయోక్తి కాదు. పైగా కరోనా టైంలో ఎంత చికెన్ తింటే అంత రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక చికెన్‌లో వందల రకాల వంటకాలు ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. అందులోనూ హోటల్స్, రెస్టారెంట్లలో చికెన్ పేరుతో తయారు చేసే చికెన్ కబాబ్స్, చికెన్ 65, బోన్‌లెస్ చికెన్, చికెన్ కర్రీస్ లాంటి వందల రకాల మెనూ ఐటమ్స్ మన కళ్ల ముందు మెదులుతాయి. వీటికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం తప్ప అసలు వాటికి ఆ పేరెలా వచ్చిందన్నది ఆలోచించే వారి సంఖ్య బహు తక్కువే ఉంటుంది.
చికెన్ పేరు చెబితే చాలు.. మాకు ఇంకేం అవసరం లేదంటూ లొట్టలేసుకుని లాగించేసే ఈ రోజుల్లో నెబ్రాస్కాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బోన్‌లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి చెందిన లింకన్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. నెబ్రాస్కాకు చెందిన అండర్ క్రిస్టిన్‌సన్ అనే వ్యక్తి బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను “చికెన్ టెండర్స్‌గా” నామకరణం చేయవలసిందిగా లింకన్ సిటీ కౌన్సిల్‌లో తీర్మానం చేశాడు. క్రిస్టిన్‌సన్ చేసిన తీర్మానం అక్కడున్నవారికి నవ్వు తెప్పించింది. కానీ అండర్ ఆ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందనేది అతను చెప్పిన మాటల ద్వారా అవగతమయ్యింది.
‘బోన్‌లెస్ చికెన్ అనే పదానికి అర్థం తెలుసుకోకుండానే ఆ పేరును వాడుతున్నారు. సాధారణంగా బోన్‌లెస్ చికెన్ అనే పదం కోడి రెక్కలను విరిచి చెస్తారే తప్ప మాంసం నుంచి ఎముకలను వేరు చేయరు. ఎందుకంటే మనం తినే మాంసంలో అధికబలం ఎముకల్లోనే ఉంటుంది. ఆ విషయం తెలుసుకోకుండా రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు బోన్‌లెస్ చికెన్ అనే పేరును వాడుతున్నారు. నేను వెళ్లిన ప్రతీ రెస్టారెంటులో ఇదే గమనించాను. అంతవరకు ఎందుకు, నా పిల్లలు కూడా బోన్‌లెస్ చికెన్ అర్థం తెలియకుండానే దాన్ని ఆర్డర్ చేయడం గమనించాను. అందుకే ఈరోజు సిటీ కౌన్సిల్ వేదికగా ఒక తీర్మానం చేయాలని అనుకుంటున్నాను .. అదే బోన్‌లెస్ చికెన్ వింగ్ అనే పేరును హోటల్స్ మెనూ నుంచి తొలగించాలి. బోన్‌లెస్ అనే పదానికి బదులుగా చికెన్ టెండర్, సాసీ నగ్స్, వెట్ టెండర్స్ లాంటి పేర్లను పెడితే నప్పుతుంది ‘అంటూ చెప్పుకొచ్చాడు.